ఉపోద్ఘాతము

ఉపోద్ఘాతము

            నారదుడనగా సర్వవ్యాపక తత్త్వం ఎరిగినవాడు అని అర్థం. ఎట్లనగా నారము అంటే సర్వవ్యాపకము, నారాయణ అనగా సర్వ వ్యాపక తత్త్వాన్ని తెలిపేదే. అందువలన నారదుడంటే ఆ సర్వ వ్యాపకతత్వము నెరిగిన వాడని అర్థం వచ్చింది. నారదుడు కేవలం భక్తుడే కాక, జ్ఞాని కూడా. నారద శబ్దానికి పరమాత్మ విషయక జ్ఞానాన్నిచ్చేవాడని  అర్థమున్నది. అందువలన నారద భక్తి సూత్రాలు ముక్తిని బోధించే శాస్త్రమే అవుతుంది. భక్తి క్రియలు జరిపే మనందరకు నారద భక్తి సూత్రాలు మార్గదర్శకంగా ఉంటాయి. భక్తి అంటే ఏమో ? భక్తి సలుపుట ఎలాగో? భక్తి మార్గంలో సాధన ఎలా చేయాలో ? ఫలితం ఏమిటో ? అన్నీ శ్రుతి, స్మృతి ప్రమాణంగా, శాస్త్రీయంగా, కూలంకషంగా చెప్పేది ఈ నారద భక్తి సూత్రాలు అనే గ్రంథం. శాస్త్రం అనగా అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని ఖండించే శాస్త్రం అని అర్థం.
            నారదులవారు అవిద్య, అహంకారం విషయాసక్తి లేని జ్ఞాని. సమస్త శాస్త్రాల్లోను మహా పండితుడు. తత్త్వ పరిజ్ఞాత, వ్యాఖ్యాత అయి ఉండి కూడా భగవద్భక్తికి ప్రాధాన్యత ఇచ్చి జ్ఞానాన్నిచ్చే నిజ భక్తుడు. ఈ నారదుడనే పేరుగల దేవర్షి అవతార పురుషుల లీలా విలాసం జరుపుటకు సహకరిస్తూ అన్ని కాలాల్లో అన్ని లోకాల్లో అశరీరిగా సంచరిస్తూ భగవానుని చేతిలో పరికరంలా ఉండేవాడు. ఈ పరమ భాగవతుడు బ్రహ్మ మానస పుత్రుడు. అతడు చేసే పని లోక కళ్యాణం కొరకే. కొందరికి వారి మేలు కోరి గర్వ భంగం జరుగుటకు దైవేచ్ఛ ప్రకారం నడచుకొనే మహర్షిని నిజం తెలియని వారు కలహ భోజనుడంటారు.
            ప్రకృత బ్రహ్మకల్పమందు శ్రీమహావిష్ణువు యొక్క 21 అవతారాల్లో ఈ నారదుని అవతారం మూడవది అని అంటారు. దేవర్షి నారదుడు మహతి అనే వీణ మ్రోగిస్తూ, హరి గుణ గానం చేస్తూ పారవశ్యం పొందుతూ, దేవ మానవ రాక్షసులందరికీ ఇష్టుడుగా, గౌరవనీయుడుగా ఉన్నట్లు అనేక పురాణాలలో చెప్పబడింది.
            వ్యాసమహర్షి, వాల్మీకి, శుక యోగివంటి వారికి పరమతత్త్వాన్ని ఉపదేశించిన మహానుభావుడు నారదుడు. ఇంకను ప్రహ్లాదుడు, ధృవుడు, రత్నాకరుడనే వాల్మీకి మున్నగు వారిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టినవాడు. వేద వ్యాసుడు పంచమ వేదమైన భారతాన్ని రచించికూడా తృప్తి చెందనప్పుడు, నారద మహర్షి వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని ప్రోత్సహించాడు. అందువలన వ్యాసుల వారికి అందలి భక్తి వలన తృప్తి, ఆనందం కల్గి పరమానందాస్వాదన చేసిన వాడయ్యాడు.    
            నారదుడు జన్మతః తన శరీరానికి సంబంధించి దాసీ పుత్రుడు. అతని తల్లి కొందరు మహా పురుషుల సేవకై నారదుని నియమించెను. చిన్న పిల్లవాడైన నారదుడు వారి కృపకు పాత్రుడై శ్రీకృష్ణ కథాగానం చేస్తూ భక్తుడయ్యాడు. తల్లి మరణం పిదప ఉత్తర దిక్కుగా పయనమై ఒక నదీ తీరంలో రావి చెట్టు క్రింద కూర్చుండి భగవచ్చింతన చేయుచుండెను. అతడికి శ్రీహరి దర్శన భాగ్యం కలిగి ఆనంద భరితుడయ్యెను. అఖండ బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తూ శ్రీహరి కార్యం నెరవేర్చుటకు సంపూర్తిగా అంకితమయ్యెను.
            అనేక శాస్త్రాల నెరిగిన జ్ఞానిగా ఆ శ్రీహరి యొక్క అధికాధికమైన  పరమ తత్త్వాన్ని తెలిసికొన్న వాడయ్యాడు. జనులకు ఏది అందిస్తే సులభ మోనని యోచించి, అన్నీ తెలిసినవాడై, వాటిలో భక్తికి ప్రాధాన్యత ఇచ్చి సాధకుల ముక్తి కొరకు భక్తి సూత్రాలను రచించెను. నిజమైన  భక్తికి తానే సాక్ష్యమై సాధారణ భక్తి నుండి ముఖ్యభక్తి వరకు ఎట్టి సాధనలు చేయాలో తెలియచేసే మార్గాన్ని వివరించాడు. చివరకు పరాభక్తి అనెడి భగవదైక్యతా సిద్ధి అనే మోక్షాన్ని లక్ష్యంగా చెప్పాడు. జ్ఞాన మార్గానికి, భక్తి మార్గానికీ ఎట్టి భేదం లేదని నిర్ణయించినవాడై  సకల జనులకు ఆరాధ్యమయ్యాడు.
            అట్టి నారద మహర్షుల వారి చరణారవిందాలకు సహస్ర కోటి ప్రణవాంజలులు సమర్పిస్తూ నారద భక్తి సూత్రాలకు వ్యాఖ్యానం వ్రాయడానికి ఉపక్రమించడమైనది.


లలిత స్కంధము కృష్ణ మూలము శుకాలాపాభిరామంబు మం
జు లతా శోభితమున్‌ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్‌ సుందరో
జ్వల వృత్తంబు మహా ఫలంబు విమల వ్యాసాలవాలంబునై                 వెలయున్‌ భాగవతాఖ్య కల్పతరువుర్విన్‌ సద్విజశ్రేయమై ||


- విజ్ఞాన స్వరూప్‌