26. ఫలరూపత్వాత్‌

26. ఫలరూపత్వాత్‌

            పరాభక్తి అంటే సాధించగా వచ్చే ఫలితం కాదు. దానికదే ఫలరూపంగా ఉన్నది. అది సిద్ధమే గాని సాధ్యంగా వచ్చేది కాదు.


            ఈ పరాభక్తి సిద్ధించే వరకే ఏ యోగమైనా. అది సిద్ధించడానికి ఒక మెట్టు క్రిందితో యోగాలన్నీ ఆగిపోతాయి. అనగా యోగాలు, సాధనలు, వాటి ఫలితాలు భక్తుడిని పరాభక్తి అనే అనుభూతికి సంసిద్ధ పరుస్తాయే గాని, సాధనల ఫలితం పరాభక్తి కాదు. సాధనలన్నీ పరాభక్తి లక్ష్యంగా అహంకారాదుల అడ్డు తొలగించే ఉపాయాలుగా అవసరమౌతాయి. పరా భక్తికి ఒక మెట్టు క్రింద కలిగే ముఖ్యభక్తికి తీసుకొని వెళ్తాయి. పరాభక్తి మాత్రం సిద్ధ వస్తువు. అది ఎప్పటినుండో, ఎట్టి మార్పు లేకుండా ఉన్నదున్నట్లున్నదే. కొన్ని అవాంతర కారణాల వలన భక్తుడికి తెలియబడలేదు. తెలియబడటంలో జాప్యమేగాని అన్ని విధాలైన అడ్డంకులను తొలగించుకుంటూ పోయేవరకు మొదట అది లేదన్నట్లుండి, అడ్డు తొలగిన వెంటనే అది అలాగే, అక్కడే సాక్షాత్కరించినట్లైంది. తెర వెనుకనే ఉండి, తెర తీయగానే దర్శనమైనట్లు, అది ఆద్యంతాలు లేక సిద్ధమై ఉన్నది. అన్ని సాధనలూ తెరలు తొలగించడానికే గాని, పరాభక్తిని పొందడానికి కాదు. తెర చినిగితే అది ఉండనే ఉన్నది. అందువలన పరాభక్తిని ఫల రూపంగానే చెప్తున్నారు. పరాభక్తికి ప్రాప్తి, అప్రాప్తి అని లేదు. దానిని స్వతఃసిద్ధం అంటే సరిపోతుంది.