29. అన్యోన్యాశ్రయత్వ మిత్యన్యే

29. అన్యోన్యాశ్రయత్వ మిత్యన్యే

            మోక్ష ప్రాప్తికి ఉన్నటువంటి అన్ని మార్గాలు ఒకదానికొకటి పరస్పర ఆశ్రయంగా ఉన్నాయి.

            శ్రీ రామకృష్ణ పరమహంస జ్ఞానమార్గంలో అనుసరించే యుక్తిని పురుషుడు గాను, భక్తి మార్గంలో అనుసరించే భగవత్ప్రీతిని స్త్రీగాను పోల్చారు. ఇట్టి సాదృశ్యంలో పురుషుడు కోటలోనికి మాత్రమే ప్రవేశించగలిగితే, స్త్రీ అంతఃపురంలోకి కూడా ప్రవేశించగలదు. అందువలన భక్తి మార్గం శ్రేష్ఠమని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు.


            భక్తి పూరితంగాని జ్ఞానం ఎండిన చెట్టు మొదలు వంటిది. జ్ఞానంతో కూడనట్టి భక్తి గుడ్డి ఎద్దు చేలో మేసినట్లుగా ఉంటుంది. కనుక భక్తి జ్ఞానాలు రెండూ అన్యోన్యాశ్రయాలు. యోగబలం లేనిదే భక్తుడు భక్తిలో పరవశించ జాలడు. యోగబలం లేనిదే జ్ఞానంలో అపరోక్ష అనుభూతి ఉండదు. కనుక అన్ని మార్గాలూ కలసి అన్యోన్యయాశ్రయాలు. అయితే ఏది సులువైతే దానిని ముందుగా స్వీకరించి మిగిలిన వాటిని సహాయంగా చేసుకోవాలి. నిజానికి సాధనలు వేరు వేరు కాదు. అన్నిటినీ కలిపే ఆచరించాలి. ఏ మార్గమూ మరొక మార్గానికి వ్యతిరేకం కాదు. అన్నీ సమన్వయంగా జరుగుతాయి. సాధకులు ఇతర మార్గాలను వ్యతిరేకించరాదు. భేదమని తలంచరాదు. ఏది ఎప్పుడు వీలుకుదిరితే అప్పుడది మంచిదైతే సరి, చేస్తూ పోవాలి. లక్ష్యం మాత్రం మరచిపోకూడదు.