1. అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః

నారద భక్తి సూత్రాలు-ప్రథమాధ్యాయం-పరాభక్తి యొక్క లక్షణం

1. అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః ||

            అధికారి అయిన వానికి అనుభవజ్ఞానంతో భగవదనుభవ ప్రాప్తిని బోధించుట అని అర్థం. అనగా ఇప్పుడు భక్తి గురించి వ్యాఖ్యానిస్తున్నారు.

            అంటే ఇంతకుముందు ముక్తి కొరకు తెలుసుకోవలసిన అనేక శాస్త్రాలను పరిశీలించారన్నమాట. ఇప్పుడు భక్తి విషయం తెలుసుకోవాలి. అంతేకాదు. భక్తి సాధనకు ఉపక్రమించే ముందు అతడికి యోగ్యత ఉండాలి. యోగ్యత, ఆసక్తి, శ్రద్ధ ఉన్న వారికే ఈ భక్తి విషయం తెలియజేయాలి. ఇప్పుడు అంటే అట్టి యోగ్యతను సంపాదించడం కోసం చేసిన ఇతర క్రియలు, సాధనలు పూర్తి అయిన తరువాత అని అర్థం. యోగ్యత లేక అధికారం అంటే ఏమిటి ? కర్మ నిత్యం, నైమిత్తికం, విశేషం అని మూడు విధాలు. ఈ మూడింటిలోనూ కర్త యొక్క ఆచరణలో భగవదనుభూతి కొరకు ఉద్దేశించబడినట్లైతే అతడు యోగ్యుడు, అధికారి..

            భక్తుడు అని పిలిపించుకోవాలంటే ముందుగా అతడికి భగవంతుని మీద విశ్వాసం, ప్రేమ ఉండాలి. మనసా, వాచా కర్మణా భక్తి సాధనలను ఆచరించాలనే దృఢ నిశ్చయం ఉండాలి. సానుకూల దృక్పథం, ఏకాగ్రత ఉండాలి.

            ముందుగా భక్తుడు తన లక్ష్యం ఏమిటో తెలుసుకున్న తరువాత క్రమ సాధన గురించి ఆలోచించాలి. ఎందుకనగా ఇప్పుడు మనం చూచే చాలామంది భక్తులలో ముక్తి లక్ష్యం లేదు. కోరికలను తీర్చుకోవడానికో, బాధల నివారణకో భక్తి చేస్తున్నారు. ఎప్పుడు అవసరమో, అప్పుడు మాత్రం చేసి, మానివేస్తున్నారు. భగవంతుని సరిగా అర్థం చేసుకోకుండా ఆయన మన కోరికలను తీర్చేవాడిగానే విశ్వసించి భక్తి చేస్తున్నారు. ప్రతిఫలం లభిస్తే మ్రొక్కులు తీరుస్తున్నారు. లేకపోతే ఇష్ట దైవాన్నే మార్చివేసుకుంటున్నారు. సాధారణ మానవులను ప్రసన్నం చేసుకోవడానికి ఏమి చేస్తామో దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కూడా అవే ఉపాయాలు ఆచరిస్తున్నారు. ఇట్టి క్రియలకు, మానసిక స్థితులకు భగవంతుడు ఉలకడు, పలకడని వారికి తెలియదు.

            అయితే లోకంలో చేసే భక్తి క్రియలలో దోషమున్నదా అని అంటే అవన్నీ భక్తి సాధనకు ముందస్తుగా చిత్తశుద్ధితో అవలంబించవలసినవే. అంత మాత్రానికే భగవదనుగ్రహం లభించదు. ఇంకను చేయవలసింది చాలానే ఉన్నది. మొదట్లో తెలియకనో, శక్తి చాలకనో చేసే భక్తి క్రియలు అలాగే ఉంటాయి. అదే భక్తి యోగంగా, సాధనగా భావించి చేయడం కొనసాగిస్తే కాయికంగానూ తరువాత వాచికంగా కూడా చేస్తారు. అక్కడితో ఆగక మానసిక భక్తిగా మార్చుకుంటారు. మానసిక భక్తి చేస్తూనే పూర్వపు కాయిక వాచిక సాధనలను కూడా కొనసాగిస్తారు. ఇదే విధమైన భక్తి క్రియలలో తామసిక భక్తి, రాజసిక భక్తి, సాత్విక భక్తి అని మూడు విధాలు. ఈ మాదిరి గుణాలతో జరిపే భక్తిని గౌణభక్తి అంటారు. గుణాలతో కూడిన భక్తికి సత్‌ఫలితముండదు. సాధన క్రమంలో భక్తుడు గుణాలను అధిగమించినప్పుడు అది గౌణభక్తి నుండి నిజమైన భక్తిగా పరిణమిస్తుంది. కొందరు భక్తి అనగా అప్పటివరకు వారు చేస్తున్నదే అని అనుకుంటారు. స్వార్థపూరితం  అపవిత్రం అయిన స్వభావాన్ని మార్చుకుంటూపోతే భక్తిలో నాణ్యత పెరగడం మొదలవుతుంది. స్వార్థంతో జరిపే భక్తిని స్వార్థరహితంగా మార్చుకున్నప్పుడది ''భక్తి కోసమే భక్తి''గా మారుతుంది. తుట్ట తుదకు అది ముఖ్యభక్తిగా మారి స్థిరపడుతుంది.

            ఇప్పుడు అంటే పై విధాలైన భక్తి విధానాలను తెలుసుకొని, ముఖ్య భక్తిని లక్ష్యంగా చేసుకున్న తరువాత అని అర్థం. పరమ లక్ష్యమైన మోక్షాన్ని పరాభక్తి అంటారు. అందువలన ముందుగా పరాభక్తి అనే లక్ష్యాన్ని చెప్పబోతున్నారు. దీని బోధకు సంసిద్ధమవ్వాలంటే అనుబంధ చతష్టయం తెలియాలి. అవి (1) భక్తి అంటే ఏమిటి ? (2) భక్తి ఎవరికి అవసరం? (3) భక్తి వలన కలిగే ప్రయోజనం ఏమిటి? (4) భక్తి సాధనకు యోగ్యులెట్టివారు?

            (1) భక్తి అంటే మానవుని కష్టాలను శాశ్వతంగా నివారించడానికి చేసేది. భగవంతుని నుండి వేరైన జీవుడిని తిరిగి భగవంతునిలో ఐక్యం చేయడానికి చేసేది. భక్తి అంటే కలయిక, అనగా యోగం. అందువలన భక్తి సాధన భక్తి యోగం అని పిలువబడుతుంది. భగవంతుని నుండి జీవుడు దూరమవడానికి కారణం జీవునిలో తలెత్తిన అహంకార మమకారాలు. వీటిని తొలగించుకుంటే జీవుడే దేవుడు. దీనికి మార్గం భక్తి. జీవుడు దేవుడైతే శాశ్వత ఆనందం, పరమశాంతి నిలుస్తాయి. భక్తి అనేది ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఎప్పటికైనా తప్పదు. భక్తిని వాయిదా వేసే వారు చివరికి కష్టాలతో కొట్టబడ్డప్పుడు వారి దుఃఖనివృత్తి కొరకు తప్పనిసరిగా ఏదో విధంగా ఆ దేవదేవుని ఆశ్రయించక తప్పదు.

            (2) అనేకమైన కష్టాలను చవిచూచినవారు గత్యంతరం లేక ఈ భక్తిని స్వీకరిస్తారు. పూర్వ జన్మలలో చేసిన సాధనల పర్యవసానంగా కొందరికి చిన్న వయస్సులోనే భక్తి భావం కలుగుతుంది. దీనికి ధృవుడు, ప్రహ్లాదుడు ఉదాహరణీయం. పెద్దల సలహాతో కొందరికి భక్తి భావం కలిగి సాధన మొదలు పెడతారు. కష్టాలు సంభవించినప్పుడు ప్రారంభించే భక్తి ఎలాంటిదంటే అగ్ని ప్రమాదం సంభవించాక ఆ అగ్నిని చల్లార్చుటకు బావి త్రవ్వడం ప్రారంభించడం లాంటిది. ముందుచూపుతో బావి త్రవ్వుకునే వారిలాగా, భక్తి సాధనను ముందుగానే ప్రారంభించడం ఉత్తమం. కుల, మత రహితంగా మానవులంతా భక్తి చేయడానికి యోగ్యులు. అన్ని వయసుల స్త్రీ పురుషులు యోగ్యులే.

            (3) భక్తి వలన ప్రయోజనం ఏమిటంటే భగవంతుని అనుగ్రహం పొందడం. భగవదనుగ్రహం వలన జనన మరణ రహితమైన ముక్తి కలగడం. పరమశాంతి, శాశ్వతానందం అనే పరాభక్తి సిద్ధించడం.  సంసార దుఃఖంనుండి బంధంనుండి విముక్తి చెందడం.

            (4) భక్తి సలపడానికి అందరూ యోగ్యులైనప్పటికీ ప్రత్యేకంగా భక్తి ఫలితాన్ని పొందాలంటే లక్ష్యమెరిగి చేయాలి. కోరికలు తీరడానికో బాధల నివారణకో కాక, భక్తి అనేది భగవత్ప్రీతి కొరకు మాత్రమే చేయాలి. అహంకార మమకారాల త్యాగానికి సిద్ధమవ్వాలి. ఓర్పు, నేర్పు కలిగి భక్తి చేయాలి. తామసిక, రాజసిక భక్తి గాక, అది సాత్విక భక్తిగా ఉండాలి. మోక్షం కోసం తీవ్ర తపన చెందుతూ ఉండాలి. భగవంతుడిని విడిచి ఉండలేని స్థితిలో భక్తుడుండాలి. మధ్యలో మానివేసే భక్తి కాకూడదు. భగవంతుని నుండి ఏదైనా కోరే బదులు, భగవంతుని కొరకు సర్వ సమర్పణ చేయగలిగి ఉండాలి. భక్తి సాఫల్యంగా సిద్ధించేదే పరాభక్తి.

            ఇందులో భక్తి విషయం, భక్తి మహిమ, భక్తి సాధన పద్ద్ధతులను వివరించారు. అయితే లక్ష్యమైన పరాభక్తిని ముందుగా భక్తుల నిర్ణయం కొరకు ఉద్దేశించి చెప్పడమైనది.