8. నిరోధస్తు లోకవేద వ్యాపార న్యాసః

8. నిరోధస్తు లోకవేద వ్యాపార న్యాసః

            పరాభక్తి వలన లౌకిక వ్యాపారాలను, వేద విహిత వ్యాపారాలను కూడా నిరోధించడం జరుగుతుంది. అనగా సకల వ్యాపారాలను సన్యసించడం జరుగుతుంది.

            నిరోధించడమంటే అణచిపెట్టడం కాదు. భగవంతునికి సర్వ సమర్పణ కావడం కారణంగా వాటికవే భక్తుని నుండి దూరమవడం. అన్ని వ్యాపారాలకు భగవంతుడినే సూత్రధారిగా భావించి, భక్తుడు తన కర్తృభావాన్నుండి విడుదలవడం. పరాభక్తుడైనవాడు ప్రపంచంలో ఇంద్రియ సంబంధ వ్యాపారాలను పూర్తిగా విసర్జించినవాడవుతాడు. కాని వదలడమనేది ఇంతకు ముందే సాధనలో జరిగిపోయింది.

            భగవంతుని యెడల సమర్పణ, సమాకర్షణ అనేవి ఆత్మ- పరమాత్మల మధ్య సహజం. వీటి మధ్యనున్న అడ్డంకులను తొలగించడమే నిజమైన సాధన. అది ఇంతకుముందే జరిగింది కనుక, అతడు పరాభక్తుడని పిలువబడుతున్నాడు. పరాభక్తుడికి జగద్వ్యాపారం తోచనే తోచదు. అతడికి సంసారబంధం లేదు.

            కలలంబోలెడి పుత్ర మిత్ర వనితా రాగాది సంయోగముల్‌
            జలవాంఛారతి నెండమావులకు కాంక్షల్‌ సేయు చందంబునన్‌
            తలతున్‌ సత్యములంచు మూఢుడ వృథా తత్త్వజ్ఞుడన్‌ నాకు నీ
            విలసత్పాదయుగంబు జూపి కరుణన్‌ వీక్షింపు లక్ష్మీపతీ ||
                                                                                       - భాగవతం

తా||  కలలో తోచిన సంసారంలో భార్య, బిడ్డలు, మిత్రులు, బంధువులు, వీరందరితో జీవిస్తూ పర్యవసానంగా సుఖ దుఃఖాలను పొందుచున్న మానవుడు ఎలాగున్నాడంటే, ఎండమావులలో కనిపించే నీళ్ళతో దాహం తీర్చుకోవాలనే బలమైన కోర్కె కలిగి ఉన్నట్లుంది. ఇది మూఢత్వం కదా ! ఈ సంసారం సత్యమని తలచుట వృథా ప్రయాస కదా ! సత్స్వరూపుడైన లక్ష్మీపతి యొక్క పాదపద్మములను చూపించమని, అట్టి దర్శనంతో పైన తెలిపిన సంసారంనుండి బంధవిముక్తు డగునని, అందుకొరకు అక్రూరుడు ప్రార్థిస్తున్నాడు.

            మోక్షం కోసం అపరభక్తిలో చేసే సాధనకూడా ఆగిపోయి ఫలితం స్థిరమవుతుంది. ‘‘సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య’’ అని గీతలో చెప్పినట్లు భగవంతుని ఆలంబన చేసుకొని తను మన ధనాలను ఆయనకే సమర్పణ చేయడం అనేది ఆ పరాభక్తుడిలో సిద్ధమయ్యే ఉంది.

            అయితే ఆ పరాభక్తుడి వలన వ్యాపారం జరుగుతున్నట్లుంది గాని అతడు దానికి కర్తగాదు. అది కైంకర్య పద్ధతిగా జరుగుతుంది. అందువలన అతడికి పాప పుణ్య ఫలాలుండవు. అతడి వలన జరుగుతున్నట్లుగా కనబడే జగద్వ్యాపారం యజ్ఞంగా సాగుతుంది. అది లోకకళ్యాణ కారకం. ఆ పరాభక్తుడికి బంధమేర్పడదు. అతడు ముక్తుడే.

            యజ్ఞార్థా త్కర్మణో-న్య త్ర లోకో-యం కర్మబంధనః|
            తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచరః ||
-       (3:9) భగవద్గీత
        
            చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః
            బుద్ధి యోగ ముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవః |
-       (18:57) భగవద్గీత

            ఈ సూత్రంలో న్యాస శబ్దాన్ని పై శ్లోకార్థాలతో అన్వయించి చూస్తే సమర్పణను, కర్తరి త్యాగాన్ని తెలియచేస్తున్నది. న్యాసమనేది సహజం. ఈ న్యాసంలో ఎవడు నిష్ణాతుడో అతడి జీవితమంతా యజ్ఞమే. అనగా కైంకర్యమే. అతడే పూర్ణుడు, సిద్ధుడు. అతడినే పరాభక్తుడంటున్నారు.