18. ఆత్మరత్య విరోధేనేతి శాండిల్యః

18. ఆత్మరత్య విరోధేనేతి శాండిల్యః

            పరాభక్తి ద్వారా ఆత్మానందం కలుగుతుంది. ఆత్మానందం లేని భక్తి గౌణభక్తి అవుతుంది. ఆ భక్తి మొదట అవసరమే అయినా అవి ఆత్మానందానికి దారి తీయకపోతే వ్యర్థమౌతుంది అని శాండిల్య మహర్షి చెప్తున్నారు.

            ఆత్మానందం కలగాలంటే బుద్ధి ప్రాపంచిక విషయాల మీదికి పోకూడదు. విషయ త్యాగం కావాలి. పనులు చేస్తున్నట్లుగా కాదు. అవే జరిగి పోతున్నట్లు, వాటికి అసంగంగా ఉండాలి. రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు, దంభం, దర్పం, అహంకారం పోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు భక్తుడిలో జయించబడి ఉండాలి. భక్తుడు తన ప్రవర్తనలో తమోగుణం గాని, రజోగుణం గాని లేకుండా చేసుకోవాలి. చివరకు సత్వగుణ ప్రవర్తనలోనూ, కీర్తి కాంక్ష, ''నేను ఈ మంచి పనిచేశాను'' అనే భావన కూడా రాకూడదు.

            తనచేత ఉపకారం పొందిన వారిని మరచి పోవాలి. తనచేత ఉపకారం పొందిన వారితో తనకు తరువాత ప్రత్యుపకారమవసరమైనప్పుడు అతడు నిరాకరించినా సరే తాను అతడికి గతంలో చేసిన సహాయం గుర్తుకు రాకూడదు. ఉపకారికి ఉపకారం చేయడం కాదు. అపకారికి ఉపకారం నెపమెన్నక చేసేవాడు మాత్రమే గౌణభక్తి నుండి విడుదలవుతాడు.

            ఎవరికైతే త్రిగుణాల ప్రభావం ఉండదో వారికి అహంకారం అడ్డు తొలగుతుంది. అట్టి ఖాళీలోనే ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు భక్తి హృదయ పూర్వకమైతే సాధన ఫలంగా ఆత్మానందం కలుగుతుంది. నేను భక్తి క్రియలు జరుపుతున్నాననే స్పృహ లేకుండా ఉంటాడు. ''నేను'' అనే ముసుగు ఉన్నంత వరకు భగవత్ప్రేమ సహజం కాజాలదు.

            నేను అను సంకుచితమైన నీదు ముసుగు
            క్షణములో తొలగింపజాలు ప్రేమ !
            నీవు శాశ్వత జ్ఞాన మాసింతువేని
            ముందు నిను నీవు మరచిపోవలయును         -మెహెర్‌ బాబా

            భగవంతుడు చైతన్యపు లోతుల్లో మౌనంగా ఉంటాడు. భక్తుడు కూడా అదే స్థితిలో ఉంటేనే భక్తుడు ఆయనతో కలసి ఆత్మానందుడవుతాడు. దీనినే భగవదనుగ్రహం అంటారు.

            మౌనంలోనే యదార్థం ఇవ్వడం, పుచ్చుకొనడం జరుగుతుంది
-మెహెర్‌ బాబా

            అనగా భక్తుడు భగవంతుని యెడల సహజ ప్రేమలో ఉంటూ, ప్రాపంచిక విషయాలపై మౌనం వహిస్తే భగవదనుగ్రహం కలుగుతుంది. నేను అనేది మౌనపడ్డప్పుడు, ''నేను'' అనే అడ్డు తొలగుతుంది. ''నేను'' పోతే భగవత్ప్రేమ సాక్షాత్కరిస్తుంది. అప్పుడు ఆత్మానందుడౌతాడు.

            భగవంతుడు తప్ప మరే ఇతరమైనవి నీలో ఉన్నా భగవంతుడు నీలో ప్రతిష్ఠితమవడానికి బిడియ పడతాడని మెహెర్‌బాబా చెప్పేవారు.

            కామక్రోధాదిక వైరి షట్కము జయించు
            దనుక, లేదు దివ్య పద దర్శనంబు          -మెహెర్‌ బాబా

            భక్త ప్రహ్లాదుడు తన తండ్రితో ఇలా అన్నాడు.

            లోకములన్నియు గడియలో జయించిన వాడ, వింద్రియా
            నీకము జిత్తమున్‌ గెలువ నేరవు, నిన్ను నిబద్ధుజేయు నీ
            భీకర శత్రులార్వురబ్రభిన్నుల జేసిన, బ్రాణికోటిలో
            నీకు విరోధి లేడొకడు నేర్పున జూడుము, దానవేశ్వరా !

తా||  నీ విన్ని లోకాలను గడియలో జయించిన పరాక్రమశాలివి అయినను నీవు నీ ఇంద్రియాలను, నీ చిత్తాన్ని జయించలేకపోతివి. నిన్ను గట్టిగా బంధించి ఉన్న ఆర్గురు భయంకరమైన శత్రువులు నీలోనే ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆర్గురు శత్రువులను జయించినచో ఇక బయటి లోకాలలో ఏ ఒక్కడైనను నీకు విరోధిగా ఉండడు కదా ! ఈ విషయాన్ని వివేకంతో గ్రహించుము తండ్రీ !

            కనుక అంతః శత్రువులను జయిస్తే భగవంతుని యొక్క పవిత్ర ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశిస్తాడు భక్తుడు.

            నన్ను ప్రేమించి, ఆత్మార్పణము నెవండు
            సేయు, నాతడు నన్గాంచు చిత్తమలర
            ఎవరు భగవానుకై మరణింత్రు - వారు
            శాశ్వతంబుగ నివసింత్రు - సత్యమిద్ది                -మెహెర్‌ బాబా

            సర్వ సమర్పణ జేసికొన్న భక్తుడు ఆత్మానందం పొందుతాడు. అందుకోసం అడ్డుగా ఉన్న అహంకారాదులను తొలగించుకున్న భక్తుడు భగవంతుని ప్రేమ స్వరూప లక్షణంతో మమేకమవుతాడు.


            భక్తి అనేది ఆధ్యాత్మికమే గాని, కాయిక, వాచిక, మానసికాలు కాదని తెలియాలి. మానసిక భక్తిలో ధ్యానావస్థ, విక్షేపావస్థలను అధిగమించి ఆత్మానందం పొందటానికి ఉన్న విరోధాలను భగవంతుని యందలి ప్రీతిచే తొలగించుకోవటం తప్పనిసరి.