21. యథా వ్రజ గోపికానామ్‌

21. యథా వ్రజ గోపికానామ్‌

            వ్రజపురంలో నివసించే గోపికలే ఇందుకు నిదర్శనం.          
            చదువు, లోకజ్ఞానం లేని గోపికలు అమాయకులు. వారిని పరా భక్తులుగా నిర్ణయించారు మహర్షులు. వారి భక్తిని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడో చూడండి.

            ‘‘గోపికలారా! మీ భక్తి సాటిలేనిది. మీ చిత్తం నిర్మలం. నాపై నిష్ఠ గొలిపి సంసార బంధాలన్నీ త్రెంచివేసుకున్నారు. మీ భావాలను, అనుభవాలను నాయందే ఉంచి అనిర్వచనీయ ఆనందంతో నన్నే భజించు చున్నారు. మీ భక్తికి తగినట్లుగా ప్రతిఫలంగా నేను ఏమిచ్చినా సరిపోదు. స్వర్గలోకం, దేవతల అమరత్వం లాంటివేమీ సరిపోవు. మీ సౌశీల్యం చేత నన్ను ఋణగ్రస్తుని చేస్తున్నారు’’. ఈ మాటలనే ఉద్ధవునితో చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు.

            ‘‘ఉద్ధవా! గోపికలు నాయందే వారి మనసులను, ప్రాణాలను నిలిపి, నన్ను పొందడం కోసం భర్తలను, పిల్లలను అన్న పానాదులను, వస్త్రాలంకారా దులను, ఏక మొత్తంగా వదలి వేశారు. నా తోడిదే లోకంగా, నేనే వారి ప్రాణంగా భావిస్తున్నారు. నేను మళ్ళీ బృందావనానికి వస్తానని పేరాశతో ఉండి, విరహాన్ని అనుభవిస్తున్నారు’’.

            ఈ గోపికలకు పరమాత్మ యెడల విస్మృతి లేదు. అలా ఎప్పుడైనా జరిగితే మరలా ఆ పరమాత్మనే తలచి తలచి, ఆర్ధ్రత చెంది, మరింత ఎక్కువగా వారి భావాన్ని ఆయనపై నిలుపుకుంటారు. ఇది ఎవరో పరిశీలించి చెప్పిన మాటలు కావు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే ఉద్ధవునితో చెప్పిన మాటలు. కనుక గోపికల భక్తిని శంకించవలసిన అవసరం లేదు. ఉద్ధవుడు గోపికలను చూచి ఏమన్నాడో చూడండి.

            ‘‘అహో! వీరెంతో ధన్యాత్ములు. వీరు పాలు పితుకుతూ, మజ్జిగ చిలుకుతూ, అన్ని పనులూ చేస్తూ కూడా సర్వావస్థలలోనూ భక్తితో నిండిన హృదయాలతో హరి కీర్తనలు పాడుతూ ఉంటారు. వీరి భక్తి రసం ఆనంద బాష్పాలుగా కారిపోతున్నది. వీరు భగవత్స్మరణ తప్ప మరేమీ ఎరుగరు. వీరిని ఏమని పొగడెదను’’ ?

            గోపికలతో జరిపిన శ్రీకృష్ణ రాసలీల, గోపికల నిష్కపట పరి పూర్ణమైన ప్రేమ, వారి సంసార పరిత్యాగం మొదలగునవి భక్తి సాధకు లందరికీ ఆదర్శ ప్రాయం. నింబార్క, జయదేవ, గౌరాంగ, వల్లభాచార్యుల వంటి వారికి ఆ గోపికల భక్తి ప్రేరణ అయ్యింది. గోపికల భక్తి పరాభక్తియే గాని, తక్కువది కాదు. అది గుణ ప్రేరిత భక్తికాదు. అది పరమాత్మపై కలిగిన ఏకాగ్రతతో కూడిన భావపరమైన సంగత్వం. ఇది జీవేశ్వరైక్యమేగాని, మరొక అర్థం తీయరాదు.

            ఎందుకంటే ప్రాపంచిక వస్తువులపై ఏకాగ్రత బంధహేతువవుతుంది గాని, పరమాత్మపై ఏకాగ్రత అలా కాదు. అది ముక్తిదాయకమవుతుంది.


            ఆ కాలంలో గోపికలు శ్రీకృష్ణుని ముందుగా అతని దేహాన్ని ప్రేమించి, తరువాత అతని కల్యాణ గుణాలకు ఆకర్షితులై, అతని మహత్తును, లీలలుగా చూచి ఆనంద పరవశులై క్రమంగా నిరంతరం హృదయ పూర్వకంగా ప్రేమిస్తూ ఆయనను విడచి ఉండలేని వారుగా తయారయ్యారు. కాని ఈ కాలంలో అది అపవిత్రానికే దారి తీస్తుంది. గోపికల భక్తి మీద ఉన్న సందేహాలను నివృత్తి చేయబోతున్నారు.