10. అన్యాశ్రయాణాం
త్యాగో-నన్యతా
పరాభక్తుడికి
అహంకారం ఉండదు. భగవత్ప్రేరణను బట్టి భక్తుడు ఆ భగవంతుని పరికరంగా పనిచేసే అహంకారం
మాత్రం ఉంటుంది. పరాభక్తిలో స్థిరం కాకమునుపు భక్తుడి మనసు చిత్తవృత్తుల ప్రకారం
నడిచేది. ఆ చిత్త వృత్తులను ఉదాసీనంగా చూడటం అలవాటైన పిదప ఇక వ్యాపారం అంటూ ఉండదు.
అతడికి తెలియకుండానే వ్యాపారం జరిగిపోతూ ఉంటుంది. అందువలన ఆ పరాభక్తుడు కర్తగా
ఉండడు, భోక్తగా ఉండడు. అతడికి
ఇష్టాయిష్టాలు ఉండవు. సకల వ్యాపారాలకు భగవంతుడే అధిష్ఠానంగా ఉంటాడు. ఇతరమైన
అధిష్ఠానం గాని, ఉద్దీపనం గాని లేకుండుటను అనన్యత
అని నిర్ణయిస్తారు. అందువలన పరాభక్తుడు అన్యాశ్రయాన్ని త్యాగం చేసి ఉంటాడు.