15. తల్లక్షణాని వాచ్యంతే నానా మత భేదాత్‌

15. తల్లక్షణాని వాచ్యంతే నానా మత భేదాత్‌

            పరాభక్తుని లక్షణాలు ఇతరులకు అర్థం కావు. వారు అతడి బాహ్య క్రియలను బట్టి నిర్ణయిస్తే, అది అతడి ఆంతరంగిక స్థితితో సరిపోదు. చూచేవారి ఊహలనుబట్టి కూడా భిన్న భిన్నాలుగా ఉంటుంది. అయినా అతడి నిజ స్థితి ఏ ఒక్కరి ఊహకు సరిపోదు. భక్తుని లక్షణం ఆ భక్తునికి మాత్రమే అనుభవగోచరం. అయినప్పటికీ పరాభక్తుని లక్షణాలు మరొక పరాభక్తునికి తెలుస్తాయి. అదే మాదిరి నారద మహర్షి వంటి వారికి తెలుస్తుంది. కనుకనే మనకు యీ నారద భక్తి సూత్రాలు లభించాయి. పరాభక్తులు ఈ క్రింది విధంగా చెప్తున్నారు.

            1. ఈ పరాభక్తి అనాది కర్మలను నశింపచేస్తుంది. అనాది కర్మలంటే మొదటి జన్మకు కారణమైన ఈశ్వర దత్త కర్మలు. తరువాతి కర్మలు జీవుడు ప్రతి జన్మలోనూ కొద్దికొద్దిగా సంపాదించినవి. తాను చేసిన కర్మవలన జన్మ, ప్రతి జన్మలోనూ మరల కర్మ చేయుట. ఆ విధంగా జన్మ కర్మ చక్రమందు తిరుగు చున్నాడు. ఇట్టి జనన మరణ చక్రం ఈశ్వరుని నియమం. దీనిని భవం అంటారు. జీవుడు నిష్కామ కర్మ యోగం, భక్తి యోగం మొదలైన సాధనలచేత వాసనాక్షయానికి ప్రయత్నిస్తే, అనాది సంస్కార బీజం మాత్రం మిగిలి ఉండి, అది ఈశ్వరానుగ్రహం వలన నశించిన పిదప పరాభక్తి సిద్ధిస్తుంది.

            2. అంతర్యామియైన భగవంతుని కల్యాణ గుణాలను వినినంతనే తన భావాన్ని తైలధారలాగా ప్రవహింపచేస్తాడు. ఇది ఆ పరాభక్తుని ప్రయత్నమేమీ లేకనే సహజంగా జరుగుతుంది. అంతర్యామితో అను సంధానమైన పరాభక్తుడు భావావేశం పొంది తను ఏయే వర్ణనలను విని ఆ భగవంతుని నిర్ణయించాడో అదే వర్ణనలతో భగవంతుని కీర్తిస్తాడు. గానం చేస్తూ కవిత్వం పొంగిస్తాడు. అంతకుముందు అతడు కవి కాక పోయినా సంగీత విద్వాంసుడు కాకపోయినా, ఆ విధంగా చేస్తాడు. అలవాటు లేకపోయినా ఏవేవో చేస్తూ ఉంటాడు.

            3. మూఢులకు ప్రాపంచిక భోగాలపట్ల ఎంతటి ప్రీతి ఉంటుందో అంతకంటే తీవ్రంగా ఈ పరాభక్తుడు భగవంతుని పట్ల ప్రీతిని కలిగి ఉంటాడు. అసలు ప్రాపంచికమైనవి అతనికి తోచవు. అవి ఎదురైనా ఉదాసీనత వహించి ఉంటాడు. వేటితోనూ బంధింపబడి ఉండడు. భగవంతుని విషయంలో మాత్రం విడచి ఉండలేని విరహంతో ఉంటాడు. భగవంతుని ఒక్క క్షణం కూడా మరచి ఉండడు. భగవంతునితో అను సంధానమై, తెంపులేని ప్రేమలో మునిగి ఉంటాడు. భగవంతుని కోసం ప్రాణాలైనా అర్పిస్తాడు.

            4. పరాభక్తుడు భగవత్ప్రీతి కలిగి ఉండి భగవంతుని నుండి ఏమీ కోరడు. ఏ ఫలం ఆశించడు. అతడి భక్తి అచంచలం, ఏకాగ్రం. ఇది యోగస్థితిగా కనిపిస్తుంది. కాని అది సిద్ధించినదే కనుక అది క్షేమ స్థితి. అది కౌశలం. అది పరాకాష్ఠ.

            5. పరాభక్తుడిలో ఒకసారి భగవంతుని కల్యాణ గుణాల భావన యౌగికం కాగా ఇక అది ఎన్నటికీ చెదరదు, తరగదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా భగవంతుడిపై ఉన్న అతడి ప్రేమ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అతడు ఆ పట్టును వదలడు. సాధకులకైతే లౌకికమైన వాటినన్నీ వదిలితే గాని ఈ భగవత్ప్రేమ సిద్ధించదు. ఈ విధంగా సిద్ధమైనదే పరాభక్తి. ఇది సమాప్తస్థితి. అతడిలో జీవ భావానికి సంకేతమైన అహంకార మమకారాలు తిరిగి తలెత్తవు. ఎందుకంటే సత్యం అనుభవమయ్యాక అసత్యం మరలా ఎందుకు నిర్ణయమవుతుంది ? ఉన్నది భగవంతుడే, భగవంతుడు తప్ప అన్యం లేదు అనే సత్యం గోచరమై, అనుభవ సిద్ధమైన పిదప ఇక జీవ భావంగాని, ప్రపంచ భావంగాని తోచదు. ఇదే కదా పరాభక్తి అంటే !

            6. శాండిల్య భక్తి సూత్రాల ప్రకారం భగవంతుని పట్ల పరమప్రేమ కలిగి ఉండటమే పరాభక్తి అవుతుంది. పరమప్రేమ అంటేనే లౌకిక ప్రేమకు పరమై విలక్షణమైనది. అనగా అలౌకికమైన భగవత్ప్రేమ. భగవంతుడు సచ్చిదానందుడు గనుక, పరమప్రేమ అంటే పరమశాంతి, పరమానందం. ఇది పరాభక్తి లక్షణమై ఉన్నది.

            7. స్వప్నేశ్వరుని ప్రకారం భగవంతుని మహిమలను గ్రహించి అనుభవిస్తున్నప్పుడు కలిగిన ప్రీతి పరాభక్తి అవుతుంది. భగవంతుని మహిమలను గ్రహించే భక్తుడు ముఖ్యభక్తుడు. ఆ మహిమకు పరవశించడమనేది ఇంకా భగవంతునిలో ఐక్యం కానట్టి స్థితి. భగవంతునితో అనుసంధానమైనట్టి భక్తుడు తన భావావేశ స్థితిలో కూడా ఆయన కంటే వేరుగా ఉండడు. అనగా భగవత్ప్రీతి అనేది క్రియగా ఉండదు. అది ఘన రూపమై ఉంటుంది. అదే పరాభక్తి.

            8. ఆర్ధ్రత చెందిన హృదయమే పరాభక్తి స్వరూపం. అనగా అతడి మనసు అతడి హృదయంలో విలీనమైంది. ఇక మనసనేది లేదు. తిరిగి మనసును పుట్టించే హృదయం భగవన్మయమైనందున, అది లోక వృత్తులనుండి విడుదలై ఉన్నది. అలౌకికమైనట్టి పరమానందమే పరాభక్తి.

            9. రూపగోస్వామి ప్రకారం కర్మ జ్ఞానాదుల చేత ఆవరింపబడ కుండా ఉన్నప్పుడు, అతడిలో ఏ స్థిరమైన భగవదానందానుభవముంటుందో అదే పరాభక్తి అవుతుంది. కర్మ జ్ఞానాదులచేత ఆవరింపబడినవాడు జీవుడు గనుక, పరాభక్తిలో జీవభావం నశిస్తుంది. అన్ని విధాలైన ఆవరణ దోషాలు నశిస్తే, మిగిలేది స్థిరరూప పరమానందానుభవమే. అదే పరాభక్తి.

            10. భగవత్సాక్షాత్కారమే పరాభక్తి. సాక్షాత్కారమన్నా అపరోక్షాను భవమన్నా, ఆ భగవంతునితో ఐక్యతానుసాంధానరూప పరమానందమే. ఇదే సాయుజ్యం అనబడుతుంది.

            11. యమునాచార్యుల ప్రకారం, భగవద్వియోగ భయమే పరాభక్తి అవుతుంది. చిన్న పిల్లలు భయపడినప్పుడు తల్లిని కౌగిలించుకొని బయటి వస్తువుల ద్వారా కలిగిన భయం నుండి విడుదలై తల్లియందు ఏలాగున సేద తీరుతారో, అదే విధంగా భక్తుడు భగవంతునిలో చేరి నిర్భయుడౌతాడు. భగవంతుని నుండి వేరవడానికి భయపడతాడని చెప్పడంలో అర్థం భగవంతునితో మమేకమౌతాడని చెప్పడమే అవుతుంది.


            ఈ విధంగా పరాభక్తి లక్షణాలను వారి వారి అనుభవాలను బట్టి అనేక మతస్థులు, స్వానుభవపరులు వివరించారు.