17. కథాదిష్వితి గర్గః

17. కథాదిష్వితి గర్గః

            భగవంతుని సచ్చరిత్రలను ఆసక్తిగా వినడం, భగవంతుని లీలలను, అనుగ్రహాలను తెలిసి పరవశించడం వంటివి కూడా భక్తి సాధన క్రిందకు వస్తాయి అని గర్గ మహర్షి మతం.           

            జపం, కీర్తనం, పురాణ పఠనం, హరికథా గానం, స్తోత్రాదులు ఇవన్నీ కూడా శ్రద్ధతో, భక్తి ప్రపత్తులతో చేస్తే అది కూడా భక్తి సాధనే అవుతుంది. కాని ఇవి కాయిక, వాచిక భక్తి క్రిందకు వస్తాయి. కొందరు పరాభక్తులు మాత్రం ఈ భక్తి క్రియలు వారికి అవసరం లేనప్పటికీ ఇతరులకు ఆదర్శంగా ఉండటానికి చేస్తూనే ఉంటారు. ఇది దైవీ ప్రేరణ వలన గాని, భగవత్ప్రేమ పొంగిపొర్లడం వలన గాని క్రియా రూపమౌతుంది.

            ప్రేమ గంభీరమై, అనివార్యమైన భక్తి
            వాగ్రూపము వహించి, ప్రకటితమగు     -మెహెర్‌ బాబా

            భక్తి సాధనలో సాధకుడు తనను తాను సంస్కరించుకుంటూ పోతాడు. పిమ్మట గౌణభక్తి ముఖ్యభక్తిగా మారినప్పుడే భగవదనుగ్రహం లభిస్తుంది. భగవంతుడు భక్తి గీతాలతో కూడిన నాలుక భాష వినిపించు కోడు. హృదయపూర్వకమైనది మాత్రమే ఆయనను చేరుతుంది.

            నామ జప సంకీర్తనములవంటి
            జిహ్వ భాషకు దేవుడు చెవినొసగడు
            కర్మకాండ నన్ను కప్పివేయును సుమా !
            విమల పూజ నన్ను వెలికి దెచ్చు   -మెహెర్‌ బాబా

            విష్ణు సహస్రనామం తెలియచేసిన భీష్ముని ఉపదేశమేమనగా ''భగవంతుని నామస్మరణ, అర్చన, ధ్యానం, స్తుతి రూపమైన భజన ఆచరించుట ఉత్తమ ధర్మం''. యజ్ఞాలలో కెల్లా ఉత్తమ యజ్ఞం జపయజ్ఞం అని గీతా వాక్యం కదా ! యజ్ఞం అంటే నిష్కామ రూపక్రియ అని అర్థం. పై చెప్పినవన్నీ భక్తి సాధనగా చేస్తూ చివరకు హృదయ పూర్వకంగా చేసికొననిచో అవి భగవంతునికి చేరవు.

            నిరాడంబరమైన నిశ్శబ్ద భక్తి అయితే అది హృదయ భాష. హృదయంలో ఏర్పడిన ప్రేమ సందేశమయితేనే, భగవంతునికి చేరుతుంది. ముఖ్యభక్తిని సాధించాలంటే భగవదనుగ్రహం కావాలి. కనుక భగవంతుని ప్రేమించవలసిన రీతిగా ప్రేమించాలి. అది ఇంద్రియాల సంబంధంగా ఉండకూడదు. స్వార్థంతో కూడినది కాదు. కోరికలకోసం కాదు. మమకార వ్యామోహాలున్నప్పుడది భగవత్ప్రేమ కాదు. అహంకారం అడ్డు తొలగే వరకు అది గౌణభక్తి మాత్రమే. ఈ భక్తి హృదయపూర్వకంగా మారినప్పుడు అది అకారణ భక్తి అవుతుంది. పర్యవసానంగా ముఖ్యభక్తి అవుతుంది. భగవదనుగ్రహం కలిగేది ముఖ్యభక్తులుగా మారినవారికే. అప్పుడతడు ప్రాపంచిక విషయాలనుండి విడుదలవుతాడు. ఫలితంగా భగవంతునితో మమేకమవుతాడు. ఈ స్థితిని పరాభక్తి అంటారు. దీనినే పరమప్రేమ అని కూడా అంటారు.

            పరాభక్తులను జీవన్ముక్తులని అద్వైతులంటారు. విశిష్టాద్వైత మతస్థులు వీరిని భాగవతోత్తములంటారు. వీరిలో అహంకారం యొక్క జాడ ఉండదు. సాధనలో ఈ అహంకారం పోగొట్టుకోక తప్పదు. అహంకారంతో జీవించడం వేరు, భక్తుడుగా ఉండడం వేరు అని అనుకుంటూ ఉంటారు కొందరు భక్తులు. కాని నిజమైన భక్తి కావాలంటే దురహంకారమే కాదు, సాత్వికాహంకారం కూడా తొలగిపోవాలి.  అహంకారం అడ్డు తొలగనిదే ముక్తుడు కాలేరు.

            భగవంతునికి, భక్తునికి మధ్య అహంకారమే అడ్డు గనుక, భగవదైక్యం జరగాలంటే అహంకారం పోవాలి.

            నీవు నన్ను ప్రేమించు, నీకు - నాకు       
            అంతరమ్మున నేమియు నడ్డుకొనదు
            ప్రేమ కల్గియుండుము, ఎప్డు ప్రేమ కల్గి
            యుందో, భగవదైక్య మవశ్యమందగలవు

-మెహెర్‌ బాబా