5. యత్ప్రాప్య నకించి ద్వాంఛతి నశోచతి నద్వేష్టి న రమతే నో త్సాహీ భవతి

5. యత్ప్రాప్య నకించి ద్వాంఛతి నశోచతి నద్వేష్టి న రమతే నో త్సాహీ భవతి

            ఆ పరాభక్తి ప్రాప్తించినప్పుడు ఇక ఏ వస్తువుమీద గాని, విషయాలపై గాని వ్యామోహం ఉండదు. అందువలన అతడు శోకించడు. ఎవరినీ ద్వేషించడు. విషయాసక్తిలేని వాడవుతాడు. దేనిపైనా ఉత్సాహం చూపడు. ఇతడి వైరాగ్యం నిగ్రహించినందువల్ల కలిగింది కాదు. తనలో తానే అయివున్న భగవంతునితో మమేకమై తన యందు తాను తనతోనే క్రీడిస్తున్నందువలన బయటి ప్రపంచమేదీ తనకు పట్టదు. అదే నిజ వైరాగ్యం. అందువలన అది అపరవైరాగ్యం కాదు. ఇది స్వతస్సిద్ధమైన పరావైరాగ్యమే అవుతుంది. ఎందుకంటె అతడు ప్రపంచాభిముఖం నుండి విరమించినవాడై భగవదున్ముఖుడై ఉన్నాడు. అందువలన అతడికి సంసారం లేదు, దుఃఖం లేదు. అతనిలో రాగద్వేషాలు జనించవు. ఆ శ్రీహరియందు తన బుద్ధిని నిలిపి, నిశ్చయమై తిరిగి విషయాభిముఖమవటానికి ఇష్టపడడు.

            తులసీదాసు రామాయణంలో ఇలా ఉంది. ''నేను సద్గతి కోరను. జ్ఞానాన్ని కోరను. సంపదలను కోరను. అష్ట సిద్ధులను కోరను. పొగడ్తలు వద్దు. కాని శ్రీరాముని చరణారవిందాలపై మాత్రం అచంచల అప్రయత్న భక్తి భావం కుదిరితే చాలును''. పరమప్రేమ అంటే ఇదే.

            ప్రేమ అనేది ఏదీ కోరదు. ప్రేమ కోసం అన్నీ త్యాగం చేస్తుంది. కనుక ప్రేమికుడైన భక్తుడు ప్రియతముడైన భగవంతుడిని ఏమీ కోరడు. భక్త కన్నప్ప శివుని ఆ మాదిరిగానే ప్రేమించాడు. తానేమీ కోరలేదు. పైగా శివుని కళ్ళు నీరు కారుతుండే తన రెండు కళ్ళూ తీసి శివుడికి అమర్చాడు. కోరవలసి వస్తే భక్తుడు తనలో భగవంతునిపై తరగని భక్తి కొనసాగేటట్లు అనుగ్రహించమని కోరతాడు. బాధలను తొలగించమని కూడా కోరడు. ''భగవంతుని కృప తనపై ఉంటే చాలును'' అని కోరుతాడు. కోరికలతో చేసే భక్తి నిజభక్తి కాదు. నిజభక్తుడు భగవంతుని కోసం సర్వమూ త్యాగం చేసి తాను కూడా సర్వసమర్పణమవుతాడు. అప్పుడు అదే పరాభక్తి అనబడుతుంది.

            ప్రేమ ప్రియతముని నర్థించబోదు
            ప్రియతముని సన్నిధి భక్తితో వేడుకొనును
                                                                   -మెహెర్‌ బాబా

            కనుక ఆ శ్రీహరి రూపంతో తాదాత్మ్యతే యోగం. తన్మయమే జ్ఞానం. ఈ భక్తుడికి వేరే యోగాభ్యాసం అవసరం లేదు. జ్ఞాన సముపార్జన కూడా అక్కరలేదు. గోపికల భక్తి అటువంటిది. వారు ఉద్ధవుడితో ఇలా అన్నారు.

            ''ఉద్ధవా ! మాకున్నది ఒక్క మనస్సే ! ఆ ఒక్కటీ మా శ్యామ సుందరునితో పాటే ఉంటున్నది. ఇక నీవు చెప్పే ఆరాధన చేయాలంటే మా వద్ద మా మనసులు లేవు కదా !''. ''మా తనువులు, మనసులు, ధనం అన్నీ ఆ ఒక్కడైన శ్యామ సుందరుడే ! సర్వకాల సర్వావస్థలు ఆ శ్యామ సుందరుడే ! మా హృదయమూ, జీవనమెల్లా ఆ శ్యామ సుందరుడే! మాకు యోగమెలా కుదురుతుంది ? రోమ రోమమూ శ్యామ సుందర మయమై ఉంటే !''

            తను మనో ధనములు సమస్తము గురున
            కర్పణ మొనర్ప, అదియె సర్వార్పణమ్ము సుమ్ము
                                                                       -మెహెర్‌ బాబా


            భక్తి పరాభక్తి అయితే, ఏ యోగం, జ్ఞానం అవసరం లేదని గోపికా భక్తి తెలుపుతున్నది. ఈ దృష్టి కలవారు సర్వ సత్త్వ సుఖ హితైక వర్తులవుతారు. ఇది వారికి ఉపాథి ఉన్నంత కాలం స్వధర్మమవుతుంది. ఇది నైజమేగాని బలవంతపు మాఘస్నానం వంటి తాత్కాలిక దీక్షలు కాదు. అలాంటి వారే ధీరులు. వారే జ్ఞానులు, పరాభక్తులు. వారు దేనినీ కోరరు. అలాగే ఉన్నవాటిని వదిలించుకోవాలని అనుకోరు. వారి ఆచరణ లోకోత్తరం. అది లోక కళ్యాణ కారకం. అది భగవత్సేవా పరాయణం.