3. అమృత స్వరూపా చ

3.      అమృత స్వరూపా చ

            అమృతం అంటే యజ్ఞశేషం. యజ్ఞం అంటే పురుష ప్రయత్నం. యజ్ఞ శేషమైన భక్తి అమృత స్వరూపం.

            భగవంతునితో మమేకం చేసే ప్రేమ జనన మరణ చక్రంనుండి రక్షిస్తుంది. కనుక ఈ పరమప్రేమ దేహసంబంధమైన మరణం కంటే భిన్నమైనది. హృదయానికి సంబంధించిన ఆత్మ తత్త్వం. అందువలన ఈ పరాభక్తి అనేది అమృత స్వరూపం. అనగా మరణం లేని శాశ్వత తత్త్వం. దీనినే ముక్తి, కైవల్యం, అపవర్గం అనే పదాలతో పేర్కొంటారు. పరాభక్తిలో భక్తుడి స్థూల శరీరం రాలి పోయిన తరువాత తిరిగి యేర్పడదు. అనగా జన్మను తీసుకోడు. సూక్ష్మ శరీరం కూడా భంగమై, ఆత్మ తత్త్వమే మిగులుతుంది. అప్పుడది అమృత స్వరూపం. దీనినే జీవేశ్వరైక్యం అని అంటారు.

శ్లో||  ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మాన మవసాదయేత్‌
            ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ||
- భగవద్గీత

తా||  మనుజులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకోవాలి. తమకు తామే అథోగతి పాలు కారాదు. ఏలనన లోకంలో వాస్తవంగా తమకు తామే మిత్రులు, బంధువులు, తమకు తామే శత్రువులు.

            అందువలన స్వేచ్ఛ, ఆనందం, అమృత తత్త్వాల త్రిపుటియే సాధనల పరమావధి.